బుధవారం, డిసెంబర్ 02, 2015

ఎగిరే పూవులు


అవునర్రా యెగిరే పూవులే.

చిత్రం కాకపోతే ఎక్కడన్నా పువ్వులు ఎగురుతాయా అని అనుమానం వస్తుంది కదా.  

తప్పకుండా వస్తుంది మరి.  అందుకే కొస దాకా చదవండేం.

ఒకప్పుడు నిజంగానే పువ్వులన్నీ ఎంచక్క ఎగురుకుంటూ తిరిగేవి లోకంలో.  ఇప్పటికీ అలా తిరిగే పూవులూ ఉన్నాయి.  అవేంటో చెప్పలనే యీ‌ టపా మరి.

మీరు నమ్మక పోతే నేనేం చేయనూ?  ఒకప్పుడు పర్వతాలకు పర్వతాలే హాయిగా ఎగురుకుంటూ చిత్తం వచ్చినట్లు భూలోకం అంతా తిరుగుతూ ఉండేవని పురాణాల్లో మాచెడ్డ స్పష్టంగా ఉంది.  అలా అవి - అంటే ఆ పర్వతాలు - ఎక్కడపడితే అక్కడికి ఝామ్మంటూ ఎగురుకుంటూ పోయి బిచాణా వేసే సరికి వాటి కిందపడి జనంకాస్తా లబోమని వందలూ వేలూగా చచ్చూరుకుంటూ బహుచెడ్డ ఘోషగా ఉండేదట కూడా.  ఇదంతా చూసి దేవేంద్రుడుగారికి తిక్కరేగి తన వజ్రాయుధం తీసుకుని ఆ యెగిరే దురద కారణంగా పర్వతాల రెక్కలన్నింటినీ కత్తిరించి పారేశాడట. అప్పటినుంచీ  పెద్దవీ చిన్నవీ‌ కొండలన్నీ చచ్చినట్లు ఉన్నచోట కదలకుండా పడున్నాయని చెబుతారు.

తెలిసిందిగా మరి.  ఒకప్పుడు కొండలన్నిటికీ‌ రెక్కలుండేవని? అలాగే పూలు కూడా చక్కగా ఎగిరేవి. ఎక్కడ చూసిన ఎగురుతున్న పూలతో లోకం ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో మీరు ఊహించుకోవలసిందే.  అంత బాగుండేదన్న మాట.

కానీ యిలా పువ్వులన్నీ పుట్టీపుట్టగానే హాయిగా ఎగురుకుంటూ లేచి చక్కపోవటం పూలమొక్కలకు మాత్రం చాలా బాధగా ఉండేది.  అవి మాత్రం యేం చేస్తాయీ, కాస్సేపుండడర్రా ఆనక యెగరొచ్చూ అంటే ఆ పువ్వులు మాత్రం మాట వినకుండా పోతుంటే?

కొన్నేళ్ళు చూసీచూసీ పూలమొక్కలన్నీ పోయి దేవుడితో‌ మొరపెట్టుకున్నాయి.  మహాప్రభో మా ముఖం చూసే‌వాళ్ళు లేరు. ఎప్పుడూ బోసిగానే పడుండాల్సి వస్తోంది.  సూరీడు వచ్చేసమయానికే బోలెడు పూవుల్ని పూసి ఆయనకు స్వాగతం చెబుతాం. అరఘడియ గడిచేలోగా యీ పిల్లపూలన్నీ రెక్కలల్లార్చుకుంటూ లోకం మీద పడతాయి మమ్మల్ని వదిలేసి.  ఇది చాలా అన్యాయంగా ఉందీ అని మొత్తుకున్నాయి.

పాపం దేవుడికి జాలేసింది.  పూవుల్లారా ఇలారండీ అని ఆజ్ఞ చేసేసాడు.  దేవుడి ఆనతి మరి తప్పుతుందా.  అన్ని పూవులూ యెగురుకుంటూ దేవుడి కొలువుకు వచ్చి చేరాయి.  అక్కడ బిక్క ముఖాలేసుకుని మొక్కలన్నీ‌ అక్కడే ఉన్నాయి.  ఓహో దేవుడిగారికి ఈ మొక్కలన్నీ మనమీద పితూరీ చేసాయివీ అని వాటికి అర్థం అయిపోయింది.  అయినా బింకంగానే ఉన్నాయి పూలన్నీ.

ఏమిటి సంగతి? అని గద్దించాడు దేవుడు పూలని.

దేవుడుగారూ‌ మాతప్పేం లేదండీ, మీరు మాకు రెక్కలిచ్చింది లోకం తిరిగి చూచి సంతోషించటానికే కదా?  ఆ పనే చేస్తున్నాం. మాకూ సంతోషంగానే ఉంది, పైగా మమ్మల్ని చూసి లోకంలో అందరూ సంతోషిస్తున్నారు కూడా అన్నాయి పూలు.

ముఖ్యంగా మనుషులకు మేమంటే చాలా యిష్టం అని కొన్ని పూలు ముక్తాయింపు చేసాయి.

నలుగురు మనుషులని పిలవండి అన్నాడు దేవుడు.  వాళ్ళూ వచ్చారు సభకు.
ఏమంటారు మీరు అని అడిగాడు దేవుడు.

పూవులు ఎగురుతుంటే ఎంతో అందంగా ఉంటాయి.  మా మనస్సులకు ఆహ్లాదకరంగా కూడా  ఉంటుంది వాటిని చూస్తే అన్నారు మనుషులు.

అలాగా అన్నాడు దేవుడు సాలోచనగా.

కానీ.. అంటూ ఒకరిద్దరు మళ్ళీ యేదో చెప్పబోయి ఆగారు.

చెప్పండి భయం లేదు అన్నాడు దేవుడు.

అప్పుడు వాళ్ళన్నారు కదా, మహాప్రభో, ఈ ఎగిరే పూలతో మాచెడ్ద చిక్కుగా ఉందండీ. ఇవన్నీ‌ ఆకతాయిలు. మేము అన్నం తింటుంటే వచ్చి పళ్ళాలలో వాలటం చేస్తుంటాయి.  ఒక్కో‌సారి  తెరలుతెరలుగా వచ్చి మా కళ్ళకు ఏమీ కనబడకుండా చేసి వినోదిస్తుంటాయి కూడా అన్నారు వాళ్ళు.

ఔరా అని ఆశ్చర్యపోయాడు దేవుడు.కించిత్తు కోపం కూడా వచ్చిందేమో!

అప్పుడు కంగారుపడి పూలమొక్కలు తమ పిల్లల్ని వెనకేసుకొని వచ్చాయి.  పువ్వులన్నీ అందాలూ ఆనందాలూ పంచుతాయీ, యెంతో మంచివీ, కేవలం కొంచెం అల్లరి చేస్తున్నాయంతే మా దగ్గర ఉండకుండా, అంతే  అని నసిగాయి.

ఒక పక్క అవల్లా దేవుడికి నచ్చజెప్పుకుందుకు తాపత్రయ పడుతున్నాయా, యీ లోపల పూవులు మంచి పిల్లల్లా బుధ్ధిగా ఉండవచ్చు కదా? ఊహూఁ. అవి తిన్నగా ఉండే రకమా? వాటిల్లో చాలా రకాల పూలు దేవుడి ముందే నిర్భయంగా గుంపులు గుంపులుగా తెరలు తెరలుగా జోరుగా ఎగురుతూ అల్లరి చేసేస్తున్నాయి.

దేవుడికి తిక్కరేగింది. ఎగరటం ఆపండి అని గర్జించాడు. సందడి తగ్గింది.

వినండి బుధ్ధిగా అన్నాడు దేవుడు. అల్లరి చేసే యీ పూలన్నీ ఇకమీదట మొక్కల్ని అంటి పెట్టుకొనే ఉంటాయి. మీ‌ ఆయుస్సును కూడా ఒకరోజుకు పరిమితం చేస్తున్నాను. అదే మీకు శిక్ష అన్నాడు.

కొన్ని పూవులు గొంతు పెకల్చుకొని కష్టం మీద దేవుడితో మొరపెట్టుకున్నాయి, మహాప్రభో మేం అల్లరి చేయలేదూ‌ అని.

దేవుడి వాటిని దయతో చూసి అన్నాడు. సంతోషం. కాని మీరు కూడా ఇప్పటి దాకా చిత్తం వచ్చినట్లు ఎగిరిన బాపతే లోకంలో. కాబట్టి మీకూ శిక్ష ఉంది వేరేగా. మీరు ఎగిరే పూవుల్లాగేనే ఉండండి. ఇకనుండి మొక్కలకు పుట్టనవసరం లేదు. పూలమొక్కల చుట్టు తిరిగి పూల మకరందాలతో‌ పొట్టపోసుకోండి.  ఇకనుండీ మీరంతా పువ్వుల్లా కనిపించే పురుగులై పొండి అన్నాడు.

పురుగులమా అన్నాయి అవి బిక్కచచ్చిపోయి.

దేవుడూ నవ్వాడు. ఫరవాలేదు. లేకపోతే నశించిపోరా మరి?  మీరంతా ఎగిరే పూవులు. జనం మిమ్మల్ని చూసి వినోదిస్తారు. మిమ్మల్ని సీతాకోక చిలుకలు అని ముద్దుగా పిలుస్తారు. సరేనా అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు.

ఇంక అంతా పోండి. నాకు బోలెడు పనుంది అన్నాడు దేవుడు.

అదండి సంగతి. కథ కంచికి మనం యింటికి.

కథ చదివినందుకు సంతోషమర్రా.  సరదాగా ఈ సీతాకోక చిలుకల మీద వీడియో కూడ చూసేయండి పనిలో పనిగా.

3 కామెంట్‌లు:

  1. ఒహోహో ...
    గాల్లో ఎగిరినంత హాయిగా ఉంది చదువుతుంటే ...
    మీ రచనా శైలి అలా అలా చదివింప చేసింది ...
    ఇంకా ఇంకా వ్రాయండి ...
    పెద్దల్ని పిల్లలుగా మార్చండి ...
    పిల్లల్ని పెద్దగా రంజింపజేయండి ...

    kudos ...

    రిప్లయితొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?