ఆదివారం, డిసెంబర్ 27, 2015

తెలతెలవారే చల్లని వేళ ఒక మందారం వికసించినది


తెలతెలవారే
చల్లని వేళ
బిలబిలాక్షుల
గడబిడ వేళ
తలుపులు తెరచి
ఇలు వాకిళుల
లలనలు ముగ్గులు
పరచే  వేళ




ఒక ఊరిలో
ఒక వాడలో
ఒక తోటలో
ఒక మూలన
ఒక కొమ్మపై
ఒక రెమ్మపై
ఒక మందారం
వికసించినది

ఆ పూవుదే
ఆ అందమూ
ఆనందమూ
ఆర్భాటమూ
ఆ తోటలో
ఆ పూవుతో
అ ఆమని
అరుదెంచినది


సోమవారం, డిసెంబర్ 21, 2015

ఒక పూవు పూసిన మరుక్షణం






విరితావికీ
చిరుగాలికీ
విడదీయరాని బంధము
అరుదైనది ఆ స్నేహము

ఒక పూవు పూసిన మరుక్షణం
విరితావి  ఎగసిన తక్షణం
చిరుగాలి అచటికి వచ్చును
సరదాల ఊయల లూపును

అల్లరి చిరుగాలి కదిలేను
మెల్లగ మధుపాన్ని చేరేను
చల్లగ శుభవార్త చెప్పేను
నల్లాడు రివ్వున వచ్చేను

అరుదెంచిన భ్రమరానికి
దొరికేను తేనె విందులు
విరికన్నియ భాగ్యానికి
చిరుగాలి వేయు చిందులు





శుక్రవారం, డిసెంబర్ 18, 2015

పూవుల ఊసులు పాటలు చాలు పూలతీగకి




పూవుల ఊసులు పాటలు చాలు పూలతీగకి
పోలిక లెందుకు పోరులెందుకు పూలతీగకి






వెతుకులాటలు వదలెయ్యండి
పూలపాటలు చదివెయ్యండి


భూమిని స్వర్గం చేసే పూవులు
మీ మనసులలో రేపును ఊహలు
 




పూలను పూలతీగను పలకరించండి
పరీమళాలకు మరీమరీ పులకరించండి






గురువారం, డిసెంబర్ 17, 2015

ఓ సుమబాలా ఓ‌ సుమబాలా భ్రమరం కోసం వేచిన బాలా








ఓ సుమబాలా ఓ‌ సుమబాలా
భ్రమరం కోసం వేచిన బాలా

రారా భ్రమర సుందర
మంచి మధువు యిట నుందిర
అంటూ ఎందుకు తొందర
ఉన్నది పండుగ ముందర

భ్రమరనాదము వినబడగానే
నీ‌ తనువెల్ల పులకించేనే
అన్ని పూవులూ నీలాగుననే
అతని రాకకు వేచిన వేనే

భ్రమరనాదము ఓం కారమటే
భ్రమరసంగమం బ్రహ్మైక్యమటే
ఫలదీకరణం తపఃఫలమటే
భ్రమరమ్మిదిగో‌ కనుగొంటివటే







మంగళవారం, డిసెంబర్ 15, 2015

చిరుగాలులు మోసుకు వచ్చే పరిమళాలు మావేలే





చిరుగాలులు మోసుకు వచ్చే
    పరిమళాలు మావేలే
పరిమళాలకు సొగసుల నద్దే
    పనితన మంతా మాదేలే
పనితన మంతా మాదేలే
    చక్కనితన మంతా మాదేలే

వేకువ వెచ్చని లేత సూర్యునికి
    ఆకుపచ్చని అరచేతులతో
ఆకుపచ్చని అరచేతులతో
    అదిమి పట్టిన అర్ఘ్యబిందువులు
వదిలే వేళ చిరుచిరు గాలులు
    కదిలిస్తుంటే గలగలరవముల
మెదిలే వందన మంత్రాలు
    సంధ్యావందన మంత్రాలు
నిదుర లేపగా నెమ్మదిగా
    నిగనిగ రంగుల సొగసులతో
ముదముగ రేకులు విచ్చుకొని
    విదిలించే‌ పరిమళాలను     
పదిలముగా ప్రపంచమంతా
    పరచే గాలులు మావేలే
    
లోకం‌నిండా చీకటి నిండి
    ఆకసమంతా నల్లబడి
అకసమంతా నల్లబడి
    అదుగో‌ తారలు జల్లబడి
రాకాచంద్రుడు రాగానే
    లోకం అంతా తెల్లబడి
లోకంలో జనులందరికీ
    లోలో‌ మనసులు చల్లబడి
మైకంలో‌ మునిగే వేళ
    మాధుర్యాల మసిలే వేళ
సౌకర్యాలు శోభలు మీర
    సుగంధాలను తోడుగ తెచ్చే
ఆకతాయి చిరుగాలికి వాసన
    లలదే ఘనతలు మావేలే





సోమవారం, డిసెంబర్ 07, 2015

నునులేత చివురు రెమ్మల - కనువిందు పూల బాలలం









నునులేత చివురు రెమ్మల
కనువిందు పూల బాలలం
..  ..  ..  ..  ..   నునులేత

ఉదారవర్ణ రంజితం
మృదులదళవిశోభితం
ఉదరాన మధురమధురసం
ఉదయాస్తమాన జీవితం
..  ..  ..  ..  ..   నునులేత

చిగురాకు మాకు చుట్టము
చిరుగాలి మాకు నేస్తము
విరితేనెలాను భ్రమరము
నిరుపేదతనము ఫలితము
..  ..  ..  ..  ..   నునులేత

మా సోయగాలు క్షణికము
మా పరిమళాలు క్షణికము
మా సంతసాలు క్షణికము
మా జీవితాలె క్షణికము
..  ..  ..  ..  ..   నునులేత










శుక్రవారం, డిసెంబర్ 04, 2015

ఆనందం‌ నాదేలే.....












నాదేలే ఈ‌ఉదయం
     ఉదయం....
నాదే సాయం సమయం
    నాదే సాయం సమయం

నాదేలే ఈ‌ ఉభయసంధ్యల
    నడుమన తిరిగే‌కాలం
    నడుమన తిరిగే‌కాలం
రెండిటి
    నడుమన తిరిగే‌కాలం


తెలతెలవారే వేళకు వచ్చే
    తొలికిరణాలను తీసుకు వచ్చే
పూలబాలల ఘుమఘుమల
    పలకరింపులు నావేలే
పలకరింపులు నావేలే
    పులకరింతలు నావేలే
నులివెచ్చని తొలికిరణాల
    పులకరింతలు నావేలే
ఉదయోత్సవమూ
    హృదయానందం నాదేలే
ఆ..హా హా..హా హా...
    హృదయానందం నాదేలే
............ నాదేలే॥

రంగురంగుల దుస్తులేసుకొని
    నింగికి రంగులు పులిమే‌మబ్బుల
సింగారాలు నావేలే
    మబ్బుల హంగులు రంగులు నావేలే
బంగరు సంధ్యా నాదేలే
     నింగిని హంగులు నావేలే
నింగిపైన ఆ
    రంగుల పొంగులు నావేలే
రంగురంగుల మబ్బుల చాటున
    బంగరు జాబిలి నాదేలే
నింగిని పొడిచే లేలేత
    బంగరు జాబిలి నాదేలే
అ..హా హా..హా...హా...
    హృదయానందం‌ నాదేలే
............ నాదేలే॥ 


చిరుచిరు నవ్వుల తామరల
    చెలువా లన్నీ‌ నావేలే
గడుసరి
    చెలువా లన్నీ‌ నా వేలే
కలువమిటారుల పరువాల
    కళకళ లన్నీ‌ నావేలే
సొగసరి
    కళకళ లన్నీ‌ నావేలే
వెలుగుల ముంచే సూరీడూ
    జిలిబిలి వెలుగుల జాబిల్లీ
వెలుగులిచ్చేది నాకేలే
    పలకరించేది నన్నేలే
అ..హా హా..హా...హా...
    హృదయానందం‌ నాదేలే




............ నాదేలే॥


బుధవారం, డిసెంబర్ 02, 2015

ఎగిరే పూవులు


అవునర్రా యెగిరే పూవులే.

చిత్రం కాకపోతే ఎక్కడన్నా పువ్వులు ఎగురుతాయా అని అనుమానం వస్తుంది కదా.  

తప్పకుండా వస్తుంది మరి.  అందుకే కొస దాకా చదవండేం.

ఒకప్పుడు నిజంగానే పువ్వులన్నీ ఎంచక్క ఎగురుకుంటూ తిరిగేవి లోకంలో.  ఇప్పటికీ అలా తిరిగే పూవులూ ఉన్నాయి.  అవేంటో చెప్పలనే యీ‌ టపా మరి.

మీరు నమ్మక పోతే నేనేం చేయనూ?  ఒకప్పుడు పర్వతాలకు పర్వతాలే హాయిగా ఎగురుకుంటూ చిత్తం వచ్చినట్లు భూలోకం అంతా తిరుగుతూ ఉండేవని పురాణాల్లో మాచెడ్డ స్పష్టంగా ఉంది.  అలా అవి - అంటే ఆ పర్వతాలు - ఎక్కడపడితే అక్కడికి ఝామ్మంటూ ఎగురుకుంటూ పోయి బిచాణా వేసే సరికి వాటి కిందపడి జనంకాస్తా లబోమని వందలూ వేలూగా చచ్చూరుకుంటూ బహుచెడ్డ ఘోషగా ఉండేదట కూడా.  ఇదంతా చూసి దేవేంద్రుడుగారికి తిక్కరేగి తన వజ్రాయుధం తీసుకుని ఆ యెగిరే దురద కారణంగా పర్వతాల రెక్కలన్నింటినీ కత్తిరించి పారేశాడట. అప్పటినుంచీ  పెద్దవీ చిన్నవీ‌ కొండలన్నీ చచ్చినట్లు ఉన్నచోట కదలకుండా పడున్నాయని చెబుతారు.

తెలిసిందిగా మరి.  ఒకప్పుడు కొండలన్నిటికీ‌ రెక్కలుండేవని? అలాగే పూలు కూడా చక్కగా ఎగిరేవి. ఎక్కడ చూసిన ఎగురుతున్న పూలతో లోకం ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో మీరు ఊహించుకోవలసిందే.  అంత బాగుండేదన్న మాట.

కానీ యిలా పువ్వులన్నీ పుట్టీపుట్టగానే హాయిగా ఎగురుకుంటూ లేచి చక్కపోవటం పూలమొక్కలకు మాత్రం చాలా బాధగా ఉండేది.  అవి మాత్రం యేం చేస్తాయీ, కాస్సేపుండడర్రా ఆనక యెగరొచ్చూ అంటే ఆ పువ్వులు మాత్రం మాట వినకుండా పోతుంటే?

కొన్నేళ్ళు చూసీచూసీ పూలమొక్కలన్నీ పోయి దేవుడితో‌ మొరపెట్టుకున్నాయి.  మహాప్రభో మా ముఖం చూసే‌వాళ్ళు లేరు. ఎప్పుడూ బోసిగానే పడుండాల్సి వస్తోంది.  సూరీడు వచ్చేసమయానికే బోలెడు పూవుల్ని పూసి ఆయనకు స్వాగతం చెబుతాం. అరఘడియ గడిచేలోగా యీ పిల్లపూలన్నీ రెక్కలల్లార్చుకుంటూ లోకం మీద పడతాయి మమ్మల్ని వదిలేసి.  ఇది చాలా అన్యాయంగా ఉందీ అని మొత్తుకున్నాయి.

పాపం దేవుడికి జాలేసింది.  పూవుల్లారా ఇలారండీ అని ఆజ్ఞ చేసేసాడు.  దేవుడి ఆనతి మరి తప్పుతుందా.  అన్ని పూవులూ యెగురుకుంటూ దేవుడి కొలువుకు వచ్చి చేరాయి.  అక్కడ బిక్క ముఖాలేసుకుని మొక్కలన్నీ‌ అక్కడే ఉన్నాయి.  ఓహో దేవుడిగారికి ఈ మొక్కలన్నీ మనమీద పితూరీ చేసాయివీ అని వాటికి అర్థం అయిపోయింది.  అయినా బింకంగానే ఉన్నాయి పూలన్నీ.

ఏమిటి సంగతి? అని గద్దించాడు దేవుడు పూలని.

దేవుడుగారూ‌ మాతప్పేం లేదండీ, మీరు మాకు రెక్కలిచ్చింది లోకం తిరిగి చూచి సంతోషించటానికే కదా?  ఆ పనే చేస్తున్నాం. మాకూ సంతోషంగానే ఉంది, పైగా మమ్మల్ని చూసి లోకంలో అందరూ సంతోషిస్తున్నారు కూడా అన్నాయి పూలు.

ముఖ్యంగా మనుషులకు మేమంటే చాలా యిష్టం అని కొన్ని పూలు ముక్తాయింపు చేసాయి.

నలుగురు మనుషులని పిలవండి అన్నాడు దేవుడు.  వాళ్ళూ వచ్చారు సభకు.
ఏమంటారు మీరు అని అడిగాడు దేవుడు.

పూవులు ఎగురుతుంటే ఎంతో అందంగా ఉంటాయి.  మా మనస్సులకు ఆహ్లాదకరంగా కూడా  ఉంటుంది వాటిని చూస్తే అన్నారు మనుషులు.

అలాగా అన్నాడు దేవుడు సాలోచనగా.

కానీ.. అంటూ ఒకరిద్దరు మళ్ళీ యేదో చెప్పబోయి ఆగారు.

చెప్పండి భయం లేదు అన్నాడు దేవుడు.

అప్పుడు వాళ్ళన్నారు కదా, మహాప్రభో, ఈ ఎగిరే పూలతో మాచెడ్ద చిక్కుగా ఉందండీ. ఇవన్నీ‌ ఆకతాయిలు. మేము అన్నం తింటుంటే వచ్చి పళ్ళాలలో వాలటం చేస్తుంటాయి.  ఒక్కో‌సారి  తెరలుతెరలుగా వచ్చి మా కళ్ళకు ఏమీ కనబడకుండా చేసి వినోదిస్తుంటాయి కూడా అన్నారు వాళ్ళు.

ఔరా అని ఆశ్చర్యపోయాడు దేవుడు.కించిత్తు కోపం కూడా వచ్చిందేమో!

అప్పుడు కంగారుపడి పూలమొక్కలు తమ పిల్లల్ని వెనకేసుకొని వచ్చాయి.  పువ్వులన్నీ అందాలూ ఆనందాలూ పంచుతాయీ, యెంతో మంచివీ, కేవలం కొంచెం అల్లరి చేస్తున్నాయంతే మా దగ్గర ఉండకుండా, అంతే  అని నసిగాయి.

ఒక పక్క అవల్లా దేవుడికి నచ్చజెప్పుకుందుకు తాపత్రయ పడుతున్నాయా, యీ లోపల పూవులు మంచి పిల్లల్లా బుధ్ధిగా ఉండవచ్చు కదా? ఊహూఁ. అవి తిన్నగా ఉండే రకమా? వాటిల్లో చాలా రకాల పూలు దేవుడి ముందే నిర్భయంగా గుంపులు గుంపులుగా తెరలు తెరలుగా జోరుగా ఎగురుతూ అల్లరి చేసేస్తున్నాయి.

దేవుడికి తిక్కరేగింది. ఎగరటం ఆపండి అని గర్జించాడు. సందడి తగ్గింది.

వినండి బుధ్ధిగా అన్నాడు దేవుడు. అల్లరి చేసే యీ పూలన్నీ ఇకమీదట మొక్కల్ని అంటి పెట్టుకొనే ఉంటాయి. మీ‌ ఆయుస్సును కూడా ఒకరోజుకు పరిమితం చేస్తున్నాను. అదే మీకు శిక్ష అన్నాడు.

కొన్ని పూవులు గొంతు పెకల్చుకొని కష్టం మీద దేవుడితో మొరపెట్టుకున్నాయి, మహాప్రభో మేం అల్లరి చేయలేదూ‌ అని.

దేవుడి వాటిని దయతో చూసి అన్నాడు. సంతోషం. కాని మీరు కూడా ఇప్పటి దాకా చిత్తం వచ్చినట్లు ఎగిరిన బాపతే లోకంలో. కాబట్టి మీకూ శిక్ష ఉంది వేరేగా. మీరు ఎగిరే పూవుల్లాగేనే ఉండండి. ఇకనుండి మొక్కలకు పుట్టనవసరం లేదు. పూలమొక్కల చుట్టు తిరిగి పూల మకరందాలతో‌ పొట్టపోసుకోండి.  ఇకనుండీ మీరంతా పువ్వుల్లా కనిపించే పురుగులై పొండి అన్నాడు.

పురుగులమా అన్నాయి అవి బిక్కచచ్చిపోయి.

దేవుడూ నవ్వాడు. ఫరవాలేదు. లేకపోతే నశించిపోరా మరి?  మీరంతా ఎగిరే పూవులు. జనం మిమ్మల్ని చూసి వినోదిస్తారు. మిమ్మల్ని సీతాకోక చిలుకలు అని ముద్దుగా పిలుస్తారు. సరేనా అన్నాడు.

ఎవరూ మాట్లాడలేదు.

ఇంక అంతా పోండి. నాకు బోలెడు పనుంది అన్నాడు దేవుడు.

అదండి సంగతి. కథ కంచికి మనం యింటికి.

కథ చదివినందుకు సంతోషమర్రా.  సరదాగా ఈ సీతాకోక చిలుకల మీద వీడియో కూడ చూసేయండి పనిలో పనిగా.