మంగళవారం, డిసెంబర్ 15, 2015

చిరుగాలులు మోసుకు వచ్చే పరిమళాలు మావేలే





చిరుగాలులు మోసుకు వచ్చే
    పరిమళాలు మావేలే
పరిమళాలకు సొగసుల నద్దే
    పనితన మంతా మాదేలే
పనితన మంతా మాదేలే
    చక్కనితన మంతా మాదేలే

వేకువ వెచ్చని లేత సూర్యునికి
    ఆకుపచ్చని అరచేతులతో
ఆకుపచ్చని అరచేతులతో
    అదిమి పట్టిన అర్ఘ్యబిందువులు
వదిలే వేళ చిరుచిరు గాలులు
    కదిలిస్తుంటే గలగలరవముల
మెదిలే వందన మంత్రాలు
    సంధ్యావందన మంత్రాలు
నిదుర లేపగా నెమ్మదిగా
    నిగనిగ రంగుల సొగసులతో
ముదముగ రేకులు విచ్చుకొని
    విదిలించే‌ పరిమళాలను     
పదిలముగా ప్రపంచమంతా
    పరచే గాలులు మావేలే
    
లోకం‌నిండా చీకటి నిండి
    ఆకసమంతా నల్లబడి
అకసమంతా నల్లబడి
    అదుగో‌ తారలు జల్లబడి
రాకాచంద్రుడు రాగానే
    లోకం అంతా తెల్లబడి
లోకంలో జనులందరికీ
    లోలో‌ మనసులు చల్లబడి
మైకంలో‌ మునిగే వేళ
    మాధుర్యాల మసిలే వేళ
సౌకర్యాలు శోభలు మీర
    సుగంధాలను తోడుగ తెచ్చే
ఆకతాయి చిరుగాలికి వాసన
    లలదే ఘనతలు మావేలే





4 కామెంట్‌లు:

  1. పూవువలె విరబూయవలె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. పూలతీగ విరబూయ టానికేగా ఉన్నదీ. సంతోషం.
      ఇంతకీ‌ మీ‌ పేరేమిటో చెప్పనే లేదు సుమండీ.
      అనేక ధన్యవాదాలండీ. చదివినందుకు కొన్ని, మెచ్చినందుకు మరికొన్నీ‌అన్నమాట.

      తొలగించండి
  2. మీ కవిత చాలా బాగుంది. ఎందుకనో, ఎక్కడో
    తెలిసిన పాట వలె అనిపించింది. లేక బాణీ
    అలా అనిపించి ఉండవచ్చు. మీ రచనలు
    ఆహ్లాదకరంగా చదివింప చేస్తున్నాయి.
    regards.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూలన్నీ‌ తెలిసినట్లే ఉన్నా నిత్యనూతనాలు కదండీ. ఈ‌పాటకు మీకు తెలిసిన బాణీలో పాడుకుండుకేం భేషుగ్గా పాడుకోండి.

      మీకీ రచనలు నచ్చుతున్నాయికదా. పూలతీగకు ఆనందం. మీకేమో బోలెడు ధన్యవాదాలు అందుకు.

      తొలగించండి

ఏమండోయ్. చదివారు కదా? మీ అభిప్రాయం ఓ ముక్క చెబితే మీ‌ సొమ్మేం‌పోతుందీ?